విశాఖలో 'గూగుల్' పక్కన ఉన్న స్థలాల కోసం పోటీ ఏర్పడింది: శ్రీభరత్
- రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా క్రెడిట్ తీసుకోవడానికి వైసీపీ యత్నిస్తోందన్న శ్రీభరత్
- విశాఖ ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని వెల్లడి
- డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమేనన్న ఎంపీ
రాష్ట్రాభివృద్ధికి వైసీపీ అడ్డుపడుతోందని, ఏదైనా అభివృద్ధి జరిగితే అది తామే చేశామంటూ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ ఎంపీ శ్రీభరత్ విమర్శించారు. అభివృద్ధి పనుల విషయంలో ఆ పార్టీ కుట్రలు పన్నుతోందని, గతంలో తాము చేసిన పనులే ఇప్పుడు జరుగుతున్నట్లు నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. పారదర్శకత లేని రాజకీయాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుతోందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయని, వాటి సమీపంలోని స్థలాల కోసం మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయని వెల్లడించారు. ఇప్పుడు వస్తున్న డేటా సెంటర్లు కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని భారీ పెట్టుబడులు రాబోతున్నాయని ఆయన పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయితే రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని, రెండు వైపులా రాకపోకలు సాగించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ కార్యరూపం దాలిస్తే మరిన్ని కొత్త రైళ్లను అడిగే అవకాశం ఉంటుందని, విశాఖ - బెంగళూరు మధ్య రోజువారీ సర్వీసుల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం నుంచి తిరుపతికి వందే భారత్ రైలును మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు వెల్లడించారు.